రక్తచరిత్ర – 1

“హర్లాన్” – కెంటకీ ఆగ్నేయంలో, అప్పలేచియన్ పర్వతశ్రేణుల మధ్య, కుంబర్‌లాండ్ పీఠభూమిలో ఉన్న ఓ చిన్న టౌన్.

ఐదొందల అడుగుల ఎత్తున్న కొండచరియలతో, కుంబర్‌లాండ్ పీఠభూమి, లోతైన సన్నటిలోయలూ,  సరిగ్గా ఒక్క బండే పట్టేంత సన్నటి కొండదారుల మధ్య, చిన్ని చిన్ని జలపాతలతో ఉండే కొండకోనల ప్రాంతం. మనుష్యులు ఇక్కడ ఆవాసాలు ఏర్పరుచుకోడానికి వచ్చిన మొట్టమొదట కాలంలో, ఈ ప్రాంతం అంతా దట్టమైన చిట్టడవులతో కప్పబడి ఉండేది. కొండసాణువులలో , కొండపాదాల వద్ద, పెద్ద పెద్ద తులిప్ పాప్లర్లు పెరిగేవి. కొన్ని కొన్నిటికైతే, ఏడెనిమిది అడుగుల మొద్దులుండేవి. వాటితో పాటు, వైట్ ఓక్స్, బీచెస్, మేపెల్స్, వాల్‌నట్స్, సైకమోర్స్, బిర్చెస్, విల్లోస్, సిడార్స్, పైన్స్, హెమ్లాక్స్ లాంటి, భూగోళ ఉత్తరార్ధంలో దొరికే మొత్తం వృక్షజాతులతో ఈ ప్రాంతం నిండిపోయి ఉండేది. నేల మీద ఎలుగుబంట్లు, కొండవీటి సింహాలు, కోడెనాగులు తిరుగుతుంటే, చెట్లపైన కనీవినీ ఎరగని ఉడుతలూ, తొండలూ తిరుగుతుండేవి. పారతో  పై మట్టి తీస్తే చాలు, బొగ్గు బయట పడేది.

బ్రిటీష్ ఐల్స్ నుంచీ వచ్చి చేరిన, ఎనిమిది వలస కుటుంబాలతో హర్లాన్ కౌంటీ ఏర్పడింది. 18వ శతాబ్దంలో వర్జీనియాకి వచ్చిన వీరు, భూమికోసం  వెతుక్కుంటూ పశ్చిమంగా జరుగుతూ ఇక్కడికి చేరారు. ఇది అంత డబ్బున్న కౌంటీ కాదు. మొదటి వందేళ్ళలో, అసలు జనాభాయే లేదు. పదివేలకు పైగా తలకాయలు ఉంటే ఎక్కీ తక్కి.  మొట్టమొదట ఆవాసాలేర్పరుచుకున్న ప్రజలు, పందులు పెంచుకునేవారు, గొర్రెలు కాసేవారు, లోయప్రాంతంలో చిన్ని చిన్ని సాగు ప్రయత్నాలు చేస్తుండేవారు. గొడ్లచావిట్లో సారా (విస్కీ) తయారు చేసుకునేవారు, వర్షాకాలంలో కంబర్‌లాండ్ నది పరవళ్ళు తొక్కేటప్పుడు, చెట్లు కొట్టేసి నీటి ప్రవాహంలో కిందకు తోసేవారు. ఇరవైయ్యో శతాబ్దం వచ్చాక కూడా, దగ్గర్లో రైల్వే స్టేషనుకు వెళ్ళాలంటే, రెండు రోజులు గుర్రబ్బగ్గీలో ప్రయాణించాల్సి వచ్చేది. అసలు టౌను నుంచి బయట పడాలంటే, ముందు తొమ్మిది మైళ్ళు పైన్ మౌంటైన్ ఎక్కి అవతలకి వెళ్ళాలి. దానికీ ఓ రోడ్డంటూ ఏమీ ఉండేది కాదు. మట్టిదారిలో, బురదలో, రాళ్ళరప్పల మీదుగా వెళ్ళాలి. హర్లాన్ ఓ వింతైన సుదూరప్రాంతం. బాహ్య ప్రపంచంలోని మిగితా సంఘానికి ఈ ప్రాంతం గురించి ఏమీ తెలీదు. అసలు ఎప్పటికీ  తెలిసేది కూడా కాదేమో – ఒకవేళ ఈ పురవాసులు సఖ్యతగా ఉండుంటే. కానీ, ఈ టౌను పెద్దలైన, హోవార్డులకీ – టర్నర్లకీ ఎప్పడూ పడిచచ్చేది కాదు. పచ్చగడ్డి వేస్తే, భగ్గుమనేది.

హోవార్డు వంశ వయోవృద్ధుడు – సామ్యూల్ హోవార్డ్.  ఊరి కోసం కోర్టుహౌసునీ, జైలునీ కట్టించింది ఈయనే. అతని ప్రత్యర్ధి – విలియమ్ టర్నర్. ఈయనికి ఓ సారాయికొట్టు, రెండు పచారీ కొట్లు ఉండేవి. ఓ సారి, గాలిదుమారంతో పెద్ద వర్షం వచ్చింది. టర్నర్ పొలానికి చుట్టూ కట్టిన కంచె కాస్తా కొట్టుకు పోయింది. పక్కింటి వాడి ఆవు, టర్నర్ పొలంలోకి దూరింది. ’డెవిల్ జిమ్’ – విలియమ్ టర్నర్ మనుమడు –  దాన్ని తుపాకీతో కాల్చి చంపాడు. ఫిర్యాదు చెయ్యడానికి భయపడిపోయిన పక్కింటి పిరికివాడు, ఏకంగా ఊరే వదిలి పారిపోయాడు. ఇంకోసారి, మరొకడెవడో టర్నర్లకి పోటీగా పచారి కొట్టు పెట్టబోయాడు. టర్నర్లు వెళ్ళి, వాడితో కాసేపు మాట్లాడి వచ్చారు. అంతే, కొట్టు కట్టేసి వాడు ఇండియానాకి వెళ్ళిపోయాడు. వీళ్ళ మధ్య మర్యాదలు అలా ఉండేవి మరి.

ఓ రోజు రాత్రి, విక్స్ హోవార్డ్ , “లిటిల్ బాబ్” టర్నర్,  ఇద్దరూ కలిసి పోకర్ గేమ్ ఆడారు. ఒకళ్ళనొకళ్ళు నువ్వు మోసం చేసావంటే నువ్వని ఆరోపించుకున్నారు. ఇద్దరూ  కొట్టుకున్నారు. మర్నాడు, ఊరి మధ్య, దారిలో కలిసారు. కొండల్లో తుపాకి శబ్దాలు ఉరుమలల్లే మారుమోగాయి. గుళ్ళ వర్షం కురిసింది. చూస్తే, ’లిటిల్‌ బాబ్‌’ టర్నర్ శవమై పడున్నాడు. షాట్‌గన్ గుండు ఒకటి, గుండెను చీల్చేసింది. ప్రతీకారంగా టర్నర్ల గుంపు ఒకటి, హోవార్డుల ఇంటికెళ్ళింది. పెద హోవార్డు భార్యని అవమానించారు. ఆమె వెళ్ళి, కొడుకు విల్స్ హోవార్డ్‌కు విషయం చెప్పింది. ఏముందీ, మరుసటి వారంలో, టర్నర్ మరో మనుమడు – విల్ టర్నర్, వర్జినియాలో హగన్‌కి వెళ్తుంటే, దారిలో వాడూ, వీడూ కాల్పులు జరుపుకున్నారు. పర్యవసానంగా ఆ రోజు రాత్రి,  టర్నర్లలో ఒకడు, వాడి మిత్రుడూ కలిసి, హోవార్డ్ల ఇంటిపై బడ్డారు. ఆ తరువాత, ఈ రెండు కుటుంబాలు హర్లాన్ కోర్టుహౌసు బయట మళ్ళీ గొడవ పడ్డాయి. ఆ రోజు జరిగన కాల్పుల్లో, విల్ టర్నర్ చచ్చిపోయాడు. మర్నాడు సాయంత్రం హోవార్డు మనుష్యలు కొందరు, టర్నర్ల ఇంటికి జట్టుగా వెళ్ళారు. లిటిల్ బాబ్, విల్ టర్నర్ల తల్లి అయినటువంటి, పెద టర్నరు భార్యతో,  గొడవలు ఆపేద్దాం అంటూ సంధి మాట్లాడబోయారు. ఆవిడ నిరాకరించింది. కొడుకు చచ్చిపోయిన మట్టివైపు చూపిస్తూ, “దాని మీద రక్తపు మరకలు మాపలేరు” అంది.

ఇంకేముంది, విషయం పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. సల్ఫర్ స్ప్రింగ్స్ దగ్గర ఎదురబడిన “లిటిల్ జార్జ్” టర్నర్‌ని, విల్స్ హోవార్డు కాల్చి చంపాడు. టర్నర్లకి మిత్రులైన ముగ్గురు – కేవుడ్ల ని – దారికాచి చుట్టుముట్టి చంపేశాడు. ప్రతిగా,  హోవార్డులను వెతకడానికి ఓ దండు బయలుదేరింది. అప్పుడు జరిగిన కాల్పుల ఫలితంగా, ఓ అరడజనుకు పైగా ప్రాణాలు పోయాయి. మరికొందరు గాయపడ్డారు. మరో రోజు, టర్నర్లు ఇంకా తనని వెంటాడుతున్నారని తెలిసి, విల్స్ హూవార్డ్, ఓ స్నేహితుడితో స్వారి చేసుకుంటూ వెళ్ళి, టర్నర్ల ఇంటిపై దాడి చేశాడు. వెనక్కి వస్తుంటే, దారిలో టర్నర్లు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన పోరాటంలో, మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈసారి టర్నర్ల ఇంటికి వెళ్ళి, మళ్ళీ కాల్చబోతే, గురితప్పి ఇంకోడెవడో చచ్చాడు. ఆ తరువాత, హోవార్డ్ల ఇంటిని ఇంకో దండు వచ్చి  చుట్టుముట్టింది. మరోసారి కాల్పులు. మరికొన్ని ప్రాణాలు. కౌంటీ అట్టుడికి పోయింది. ఈ పాటికే మీకు సీను అర్ధమైపోయింటుంది. 19వ శతాబ్దపు అమెరికాలో, శాంతియుతంగా మనుగడ సాగించిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ, కెంటకీలోని  “హర్లాన్”  మాత్రం అలాంటిది కాదు.

“అక్కడే ఆగు” అరిచింది విల్ టర్నర్ తల్లి.
కోర్టుహౌస్ దగ్గర జరిగిన కాల్పుల్లో గుండు గుచ్చుకుంది. ఆ తీవ్రమైన బాధని తట్టుకోలేక, పెడబొబ్బలు పెడుతూ  గడప మెట్ల దగ్గర తడపడుతున్నవాడల్లా, ఒక్కసారిగా ఆగిపోయాడు. తుపాకి కాల్పులు, చావుదెబ్బలు ఆవిడ చాలా తరుచుగా చూసే విషయాలు. సుపరియం ఉన్న తన ఈ చిన్ని ప్రపంచంలో, వాటిని ఎలా భరించాలి అనే విషయంపై, ఆ తల్లి ఓ పద్ధతికి అలవాటు పడిపోయింది.

ఆవిడ అన్న మాటలు : ” మగాడిలా చచ్చిపో.  అన్నలా, పరువుగా చచ్చిపోరా! “

నిశ్శబ్దం . విల్ టర్నర్, నోరు ముయ్యకుండానే, మరిణించాడు.

(ఈ పోస్టులు ఓ పరంపరగా రాయలని అనుకుంటున్నాను. చూస్తునే ఉండండి. దీపావళి శుభాకాంక్షలతో….

— రేరాజ్)

ప్రకటనలు
Explore posts in the same categories: పుస్తాకాలు/రచన రివ్యూలు

ట్యాగులు: , ,

You can comment below, or link to this permanent URL from your own site.

3 వ్యాఖ్యలు పై “రక్తచరిత్ర – 1”


 1. good beginning – keep going.

  ఒక ఆలోచన – తెలుగుని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళడం అనేది మీ ఉద్దేశం అయితే (అది మీ ఉద్దేశం అన్నట్టుగా నాకనిపించింది) మీ అనువాదాలు తెలుగునించి ఇంగ్లీషులోకి ఉండాలేమో – ఆలోచించండి.

 2. rayraj Says:

  @కొతపాళీ: thank you.
  ఔను. అదే నా ఉద్దేశ్యం. అలాగే, మీ ఆలోచనే కరక్టు.

  ౧.అది – రెండు భాషల మీద పట్టున్న (మీలాంటి) పెద్దలు చేయగలరు; చేస్తునే ఉన్నారు; చేస్తూనే ఉంటారు; ఉండాలి.
  ౨.భాషలపై నేనూ ఓ పట్టు పట్టగలననే నమ్మకం, ఈ బ్లాగంగాలతోనే తెచ్చుకుంటున్నాను. ఈ రాతలు, అనువాదాలు – సమాంతరంగా నేను నేర్చుకోవడమే.
  ౩.నాకు తెలుగు సాహిత్యం తెలియదు. ఇప్పుడు నేర్చుకొనే ఉద్దేశ్యం లేదు. ఏదన్నా ఉందంటే, ఇప్పుడే, ఇక్కడే ప్రపంచం పరుగులు పెట్టుకుంటూ వచ్చి, తెలుగులో చదువుకునేలా, చర్చించుకునేలా చేయలన్న ఒక్క ఉద్దేశ్యమే ఉంది.

  నా పాయింటు పట్టుకోలేరో లేక ఒప్పుకోలేరో తెలియటం లేదు. ఆ రోజు రావలంటే, ఆలోచనలు “తెలుగులో” కూడా బాగా నలగాలి; అంతేగానీ, అనువదించబడిన నాలుగు ముక్కలే తెలుగులో (లేదా ఇంగ్లీషులో) చదువుకోవటం పరిష్కారం కాదు అనేది నా నమ్మకం.


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: