సరస్వతీ యాడున్నా, ఎత్తుకొచ్చేయ్యండి

నాకు “గే”లను కలిసే అవసరం లేదు, కానీ “గే” ఆలోచనలు తెలుసుకోవడం ఇష్టమే. ఎందుకు? అని మీరడగొచ్చు. ఎలాగూ చెప్తాగా  🙂

క్రీస్తు పూర్వమేట, ఏథేన్సు నగరవాసులని ప్రశ్నలతో ఏకేస్తున్నాడంటూ, ఆనాటి ప్రజాస్వామ్య  ప్రభుత్వం సోక్రటీస్ అనే వ్యక్తికి మరణదండన విధించి చంపేసింది. అదో రకం ప్రజాస్వామ్యంలెండి. ఐతే ఊరికే ప్రశ్నలేస్తే ఎందుకు చంపుతారు? అది కాదు విషయం. ఆ  ప్రశ్నలతో యువకుల ఆలోచన సరళి మారుతున్నందువల్ల, రాజకీయంగా వస్తున్న ఇబ్బందులవల్ల, అప్పటి రాజకీయం అతడిని అప్పటి ప్రజాస్వామ్య బద్ధంగా చంపేసిందని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు.

సోక్రటీసు వల్ల ప్రభావితుడైన ధనిక శిష్యుడు “ప్లేటో”, సోక్రటీస్ ఆలోచనలని గ్రంధస్తం చేశాడు. ”నాకేమీ తెలీద”న్న సోక్రటీస్,  ముసలితనం వరకూ మార్పు కోసం ప్రశ్నించినా,  ఎప్పుడూ తన ఆలోచనలని రాతలోకి గడ్డకట్టించలేదు. కానీ, మౌఖికమైన అతని ఆలోచన సరళి తదనంతర కాలానికి వ్యాప్తి చెందింది – శిష్యులవల్ల. సరే, ప్లేటో కూడా, సోక్రటీస్‌లాగానే తెగ ఆలోచించేసేవాడు. ఇప్పుడు ఈ ఆలోచనల వల్లే సమాజానికి మంచో చెడో జరుగుతోంది మరి! అప్పుడు వచ్చిన ప్రశ్న-ఆలోచనే, ఓ ఆదర్శ రాజ్యం ఎలా ఉండాలి? అని. సమాజానికి మంచి ఆలోచనల-మంచి ఫలితాన్ని ఇవ్వడానికి, ఓ ఆదర్శ రాజ్యాన్ని స్థాపించాలనే ’ఆలోచన’ వచ్చింది – ప్లేటోకి. ఆయా విషయాలని కూడా సోక్రటీస్ పేరుమీదే “సంవాదం”గానే రాశాడు కాబట్టి, అది సోక్రటీస్ ఆలోచనలే అనుకుంటే, బహుశా ఆనాటి రాజకీయవేత్తలు సోక్రటీస్‌ను రాజకీయ కారణాల దృష్ట్యానే చంపి ఉంటారని మనం గట్టిగానే చెప్పుకోవచ్చు. అలాగా, తత్వానికి – రాజ్యాధికారానికి మధ్య ఓ అవినాభావ సంబంధం అప్పటికే ఏర్పడి పోయింది.

ఇదిలా ఉండగా, సమాజంలోని సమస్యలకి బాటమ్‌-అప్‌లో ఏమీ ఆలోచనలు సాగవని ఎలా చెప్పగలం? అలాగూ ఆలోచనలూ, వాటి నమ్మకాలూ వేళ్ళూని వృద్ధి చెందాయి. మన విజయ్‌చందర్ “కరుణామయుడు” చూసినా, అప్పటి తీవ్రవాద రాజకీయం క్రీస్తు సహాయం కోరడాన్ని చూస్తాం. క్రీస్తు శిలువ కూడా రాజకీయమే అవ్వొచ్చు. పోనీ, మరే విధంగా మరణించినా, జనపదంలో మతంగా స్థిరపడ్డ ఆలోచనలని వాడుకొని, వాటి ప్రాతిపదికనే  కాంస్టాంటిన్ ది గ్రేట్ సామ్రాజ్యాధినేతగా పేరు తెచ్చుకొనుంటాడు.ఇస్లాం కూడా, అలాగే ఓ వ్యక్తి ఆలోచనని ఆచరణలో సాధించడానికే స్థాపించబడ్డ మరో మత-రాజ్యం.  ఇలా మతానికీ – రాజ్యాధికారానికీ మధ్య ఓ సంబంధం!

అలాగ, తత్త్వనికి-మతానికీ మధ్య రాజ్యాధికారం కోసం యుద్ధం జరుగుతూనే ఉంది. ఆధునిక కాలంలో సైతం, ఫిలాసఫర్లూ, మేధవులూ, ఆలోచనపరులవల్లే నేటి ప్రపంచం నడుస్తోంది. చట్టాలు, వివిధ దౌత్యనిర్ణయాలు ఈ మేధావుల వల్లే జరుగుతుంటాయి. ఆధునిక ఫిలాసఫర్లుగా పేరుబడ్డ బర్ట్‌రెండ్ రజల్‌ లాంటి వ్యక్తులు సైతం, రాజకీయంగా క్రియాశీలురేగా! లేదూ నేడు డెమొక్రాట్లుంటే ఫలానా మేధావి వర్గం లేక రిపబ్లికన్లుంటే ఫలానా మేధావివర్గం తమ ఆలోచనలు ఆచరణలోకి తెస్తాయి అంటాం కదా. ఇప్పుడు తెలంగాణా మేధావుల ఆలోచనలు తెలంగాణ రాజ్యాధికారాన్ని కోరడం లేదూ? రాజకీయవేత్తల చేతుల్లో అదో ఆయుధం అవ్వలేదు? అలాగన్న మాట. అలాగ, ఆలోచన -రాజ్యాన్ని, రాజ్యం-ఆలోచననీ కూడా కోరుకుంటూనే ఉన్నాయి. ఐతే, మధ్యలో మతం అవసరం లేదని, రాజ్యం నుంచి దాన్ని, తత్త్వం తోసేయ గలిగినా, మతం తనదైన ఓ సామ్రాజ్యాన్ని ఏలుతునే ఉంది. ప్రజల్లో జీవిస్తూనే ఉంది. అది ముందు పుట్టిందే ప్రజల్లోన్నేమో!

మన దేశంలో సైతం, బౌద్ధం ప్రచారం ఎలా అయ్యింది? అశోకుడు కళింగ యుద్దంతో  వ్యాకుల చెందెను. బౌద్ధమును స్వీకరించెను. పిమ్మట దేశం  మొత్తం బౌద్దం ప్రచారం చేసెను. ఇతర దేశాలకీ ప్రచార నిమ్మిత్తం జనాలను పంపెను. ఎందువల్ల అశోకుడు బౌద్ధాన్ని తీసుకున్నాడో తెలీదుగానీ, బౌద్దానికి మంచి ప్రచారమే చేశాడు. స్వయంగా బుద్ధుడే నూతన ధర్మంగా ప్రచారం చేసుకున్న రోజుల్లో సైతం, రాజులు బౌద్ధాన్ని స్వీకరించడం వల్లే, మిగిలిన అవైదిక వాదాల కంటే ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండవచ్చు! ఒకానొక కధనం ప్రకారం, బుద్దుడి సమయానికి నానా రకాల అవైదిక వాదనలతో సమాజం మారుతూ ఉండబట్టే, వాటిల్లో  బౌద్దం మరింత ప్రాచుర్యం పొందే అవకాశం చిక్కింది. (ఉపనిషత్తులను సైతం,వైదిక కర్మలకి తిరుగుబాటు తత్త్వచింతనగా, పరిణామక్రమంలో వచ్చిన ఓ తదనంతర తత్త్వచింతనగా  పరిగణించవచ్చు) ఆ విధంగా, రాజకీయ లబ్ధి, సంస్థాపక పోషణవల్ల, ఆనాటి అవైదిక వాదనల్లోకెల్లా బౌద్ధమే ప్రాచుర్యంలో ఉంటే, దాన్ని అశోకుడు తన రాజకీయ సుస్థిరతకై వాడుకొని ఉండొచ్చు. ఈ స్ట్రెటజీతో ఇంస్పైరయ్యే, కాంస్టాంటిన్ క్రైస్తవాన్నీ వాడుకొని తన రాజకీయ సుస్థిరత సాధించుకొని ఉండవచ్చు! (అసలు క్రీస్తు సైతం, బౌద్ద చింతన వల్ల ఇంస్పైర్ అయ్యుండవచ్చు!)

నా ఉద్దేశ్యం ఏంటంటే : ఆలోచన పరులవల్లే, కొత్త కొత్త ఆలోచనలు పుడుతుంటాయి. ఈ ఆలోచనలవల్ల, సమాజంలో మార్పులొస్తుంటాయి. అలాగే, ’కేవలం ఆలోచనల వల్లే’ సమాజంలో మార్పులు రావు. సమాజంలో వచ్చే మార్పులు కూడా ఆలోచనలని తెస్తుంటాయి. ఇదేమీ వన్ వే డైరెక్షన్ కాదు. అసలు ఆ కాంప్లెక్సిటీని అర్ధం చేసుకోవడం కోసమే, తత్త్వవేత్తలు ఆలొచించటం మొదలెట్టారు కూడా! ఐతే, ఆలోచన లేనిదెవరికి? ప్రతి మనిషీ ఆలోచనాపరుడే! కానీ, ఎవరైతే తమ ఆలోచనలని ఆచరణలో పెట్టాలని కోరుకుంటారో, వ్యవస్థీకృతం చేసి  “ఇదే ప్రపంచానికి ఓ మంచి వ్యవస్థ” అని చెప్పదలుచుకుంటారో, వాళ్ళు రాజకీయఆర్ధిక బలాలని కోరుకుంటారు. ఇది చూసి, రాజకీయ ఆర్ధిక బలాలనే మాత్రమే చాలనుకునే స్వార్ధ ఆలోచనపరులు సైతం, ఆలోచనపరుల వెంట తిరగటమో, వెంటేసుకొని తిరగటమో చేస్తుంటారు.

సో, అలా “ఆలోచనల” స్థానం చాలా ప్రాముఖ్యమైనది.

దీన్నే కొంతమంది సమాజంలో ఉండే భావజాలంగా కూడా చెప్తారనుకుంటాను. కానీ భావజాలం అనంగానే, మతవాదాలు, సోషలిజం, ప్రజాస్వామ్యం, స్త్రీవాదం, దళితవాదం, విప్లవం, తీవ్రవాదం, గేవాదం, వ్యక్తి స్వేచ్చ, మానవహక్కులు లాంటివి మాత్రమే తడతాయి గానీ, క్వాంటం ఫిజుక్సు భావజాలమో, ఆర్ధికశాస్త్ర భావజాలమో, ఖగోళ శాస్త్రభావజాలమో  మన మనసులకి రావు. అవి మన సమాజ భావజాలంగా లేవు. దీనికీ బహుశా ఓ కారణం ఉంది. (అది చెప్పేముందు అర్జెంటుగా మరో విషయం – కాంతికణం అనే బ్లాగులో క్వాంటం ఫిజుక్సు భావజాలాన్ని, తెలుగులో అందిస్తున్నారు. చదువుతూ ఉండటం మీకే మంచిది. ఆపై మీ ఇష్టం. సాధారణంగా ఐతే, తెలుగువారు కాస్మోకెమిస్టులైనా తెలుగులో “సంక్రాతి లక్ష్మి ఇంటికొచ్చింది! పాపం, పైరగాలికి పైట పోయింది!” అంటూ  కవితలు రాస్తుంటారు. మరో పక్క ఇంకొందరు “ఆ మధ్యాన్నం అలసిపోయా, ఈ మధ్యాన్నం ఇరగదీ“స్తుంది”(!) అంటూ రాస్తుంటారు! వాళ్ళదేమో భావకవిత్వం, వీళ్ళదేమో అనుభవ సాహిత్యం!!!  ఇలా మండిది మన అంతర్జాల భావజాలం! సరే, ఇక విషయంలోకి వెళ్దాం)

కారల్ మార్క్స్ (పేరు తెలీని వారుండరేమో!) ఓ సిద్దాంతం తయారు చేసుకున్నాడు. ఆ తత్త్వ సిద్ధాంతం ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది.పూర్తి సొంతగా  తయారు చేయలేదు లెండి. దానికీ ముందటి తత్త్వవేత్తల ఆలోచనలు నేపధ్యంలొ ఉన్నాయి.దీన్నే గతితార్కక భౌతిక వాదంగా తెలుగులో చెబుతుంటారు. ఇక ఆ సిద్ధాంతం పట్టుకొని పెద్ద పెద్ద రాజకీయ ఉద్యమాలు లేవనెత్తారు -ప్రపంచంలో ఎక్కడెక్కడి వారో!అలాంటి తత్త్వ ప్రభావంలో వచ్చిన భావజాలం, నానాజాతి సంకరజాతి భావజాలాలతో అడ్డదిడ్డంగా కలిసిపోయి, మాట్టాడితే చాలు ప్రతివాడూ ఉద్యమం చెయ్యాలనే వాడే!విప్లవం రావలనే వాడే! ఇదేగా అసలు ఈ భావజాలాన్ని వ్యాప్తి చెయ్యడానికి ప్రచారం చేసిన వారి లక్ష్యం! ఐనా ఏ విప్లవమూ రాలేదు. వస్తుందో లేదో తెలీదు. చివరికిప్పుడు నాలాంటి కొందరికి ఈ ఉద్యమాలకీ, గాంధీగారి బంద్-హర్తాళ్ళకీ, మతోన్మాదానికీ, మేథోన్మాదానికీ కూడా తేడా తెలీకుండా ఐపోయింది. ఈ మధ్య సివిల్ వార్ కూడా వచ్చేస్తోంది అని ఎవరో అంటూన్నారు. సారీ!-రేరాజ్ రాజకీయం చెయ్యడు. కానీ, తత్త్వానికీ, మతానికీ, రాజకీయానికి గల సంబంధం నేనాల్రిడీ చెప్పాశాను. అందుకని అలా తగులుతునే ఉంటుందేమో.

ఏమిటి ఈ గతి తార్కికం అంటే – ప్రతి “వాదా”నికి, ఓ “ప్రతివాదం” ఉంటూనే ఉంటుంది, వాటి మధ్య సంఘర్షణా ఉంటుంది.ఆ సంఘర్షణ ఫలితంగా ఓ సమన్వయవాదం పుట్టుకొస్తుంది. వెనువెంటనే ఈ సమన్వయవాదానికి మరో ప్రతివాదం పుట్టుకొస్తుంది. మళ్ళా మొదలు. ఈ థియరీని, మార్క్స్ చరిత్రకు కూడా అన్వయించాడుట. దాన్ని బట్టి, ప్రతి కాలంలోనూ రెండు వర్గాల మధ్య పోరాటం సాగుతూ వచ్చిందని, ఈసారి కార్మికకర్షక వర్గం విప్లవం వస్తుందని. ప్రస్తుత వ్యవస్థని ఆసాంతం మట్టుపెడుతుందని చెప్పాడు. “ప్రశ్న ప్రపంచం ఎలా నడుస్తోందని కాదు – ఎలా మార్చాలని?” అన్నాడు. అలా విప్లవాన్ని ఎలా తొందరగా తీసుకురావచ్చోనని తయారు చేసుకున్న, రాజకీయ భావజాలం మాత్రమే మనం సమాజంలోకి బాగా దిగుమతి చేసుకొని, తిని, జీర్ణించేసుకొనో చేసుకోకో  గ్యాస్‌గా వదులుతుంటాం. (నేను చేస్తోంది అదే – కడుపుబ్బరంగా తగ్గించుకోవటమే!)

ఐతే, “తత్త్వశాస్త్ర భావజాలం నుంచే సమాజ వ్యవస్థ ఏర్పడుతోంది; ఇప్పటి వరకూ ఉన్న వివిధ వ్యవస్థలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు మరో వ్యవస్థ సృష్టిద్దాం” అంటూ ముక్కు గుద్ది చెప్పిన తెలుగోడు – సరస్వతీకూమార్. (ఎఫెక్టు కోసం అలా ఏదో  చెప్పాలి!) ఆయన ప్రాచీన తత్త్వ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి, చివరికి – వాదం, ప్రతివాదం, విశ్లేషణ అనే మూడిటి సమన్వయంలో సత్యం దొరుకుతుంది అన్నాడు.Truth is the combination of fact, lie and secret అన్నాడు. ఈ “మూడిటితో” అనే ఆలోచన, త్రిగుణాలను వర్ణించిన  భారతీయ తత్త్వచింతన లోనిదేనని చెప్పాడు. అసలు “సత్యం” అంటే, ఈ త్రిగుణాల ఆంశిక సమ్మేళనమేనని నిర్వచించాడు. ఇదంతా ఓవర్‌ సింప్లిఫికేషన్, అసలు ఆయన చెప్పినదంతా తెలుసుకోవలంటే, ఆ బ్లాగులోని మొదటి వ్యాసం మొదలుకొని, అన్నీ వరుసగా పుస్తకంలాగా చదువుకుంటూ వెళ్ళటం మంచిది. అదే ఆ బ్లాగు యొక్క ఉద్దేశ్యంగా కూడా, ఆయనే చెప్పుకున్నారు.

ఆ విధంగా “భారతదేశానికి కావల్సిన వ్యవస్థ” అంటూ ఓ గ్రంధాన్ని బ్లాగులో రాసుకుంటుంటే, ఈ రేరాజ్‌ అడ్డంబడి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబ్తూ, అర్ధంతరంగా ఆపేశారు. ఇప్పటికి సంవత్సరం పైన అయిపోయింది, ఆయన కనబడటం లేదు(రాయటం లేదు.)

ఆయన రాసినవన్నీ నాకు అర్ధమైపోయాయని కాదు. అర్ధం చేసుకోవల్సినవి, ఆసక్తికరమైనవీ ఇంకా చాలా ఉన్నాయి. పైగా ఇంకా ఎన్నిటి గురించో గుద్దులాడుకోవాలి. నిజానికి +ve, -ve, and neutral అనే త్రిగుణాల రూపం పాశ్చాత్య తత్త్వచింతనలోనూ ఉదయించింది. కానీ, బహుశా వ్యవస్థగా దానికి ఓ రూపం ఇవ్వలేదేమో! నిజంగా ఇవ్వలేదా? చాలా ఉన్నాయి మాట్లాడుకోవాడానికి. ముఖ్యంగా ఆయన ఆలోచనతో సృష్టించిన ఆ కొత్త వ్యవస్థ గురించి తెలుసుకోవటం మరింత ఆసక్తికర విషయం. ఇది తెలుగులో నడుస్తున్న తత్త్వచింతన మరి!

బ్లాగ్లోలోకంలో ఎవరికైనా, వ్యక్తిగా ఆయన తెలిస్తే, కాస్త స్టేటస్ కనొక్కుని చెప్పరూ! మీకు పుణ్యం ఉంటుంది! కుదిరితే యాడున్న ఎత్తుకొచ్చేయండి – మానసభంగం చేద్దాం. 🙂

ప్రకటనలు
Explore posts in the same categories: బ్లాగుల గురించి

3 వ్యాఖ్యలు పై “సరస్వతీ యాడున్నా, ఎత్తుకొచ్చేయ్యండి”


 1. మొదట గే నెత్తుకొని తరువాత సరస్వతినెత్తుకొచ్చేద్దాం కాడికి వెళ్లిపోయారు కదండీ 🙂

 2. bondalapati Says:

  యోవ్ రేరాజూ,
  శానా కాలానికి ఓ టపా టపాలుమని ఏసినావే…టపా పేరేందయ్యోవ్ అల్లా పడేసినావు…కాస్తి మంచి గా పెడితే ఆచారపరులుగూడా నీ టపా మీద నొక్కే వాళ్ళు గందా..ఇప్పుడు అట్టాంటాళ్ళంతా నొక్కకుండా పాయిరి. సరే…నువ్వీడిచ్చిన సరస్వతి లంకెలో మొదటి టపామాత్రం సదివేసినానబ్బా! మిగతా లంకెలు సదూదారంటే నిద్రముంచుకొస్తల్లా..! శాస్తీయం గా నిరూపించ బడటానికీ హేతుబధ్ధం గా ఉండటానికీ ఆటే తేడా లేదనుకుంట గందా? ఏమైనా మిగతాది నిద్ర రానప్పుడు సదుంకోవాలి. …ఇక పోతే నువ్వు సెప్పిందాంట్లో ఈ కిందది మనసులో మబ్బులా మెదుల్తాఉండేది..ఇప్పుడంతా కిల్లియర్ ఐపోయింది…
  “కానీ, ఎవరైతే తమ ఆలోచనలని ఆచరణలో పెట్టాలని కోరుకుంటారో, వ్యవస్థీకృతం చేసి “ఇదే ప్రపంచానికి ఓ మంచి వ్యవస్థ” అని చెప్పదలుచుకుంటారో, వాళ్ళు రాజకీయఆర్ధిక బలాలని కోరుకుంటారు. ఇది చూసి, రాజకీయ ఆర్ధిక బలాలనే మాత్రమే చాలనుకునే స్వార్ధ ఆలోచనపరులు సైతం, ఆలోచనపరుల వెంట తిరగటమో, వెంటేసుకొని తిరగటమో చేస్తుంటారు.”

  ఇక పోతే ఆదర్శాల గురించి జిడ్డు కిస్టమూర్తి బాబు బాగానే సెప్తాడు..ఈ ఆదర్శాలు అట్టనే కూకోకుండా కాలం తో పాటు మారిపోతై. “ఏ ఏ టైం లలో ఉన్న నిజమైన పరిస్థితులను బట్టి వాటిలోని లోపాలను పూరిస్తా మనం ఊహించుకొనేదే ఆదర్శం..ఆదర్శమనేది ఒక ఊహ మాత్రమే..దానిని ఎప్పటికీ చేరలేం” అని చెప్పాడా బాబు.
  ఇంక బోతే ఆ మార్క్స్ ఉళ్ళా వాని గురించి మా సంగపోడు ఒకడు రాసిన రాతలు ఇక్కడ ఇత్తన్నా .. సదుంకో..
  “మార్క్సే “ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప” అన్నాడు. అంటే కార్మికులు ఇప్పటికే కష్టాలలోనే ఉన్నారు కాబట్టీ వారు తిరుబాటు లో చనిపోయినా పరవాలేదు. ప్రస్థుత స్థితి లో వారి ప్రాణాలకు పెద్ద విలువ లేదు. తను (మార్క్స్ ) మాత్రం ఒక మేధావి, పోరాటాలలోకి వెళ్తే, యూనివర్సిటీలలోనో, స్కాలర్ గానో తను పోగొట్టుకొనేది చాలా ఉంది.. కాబట్టీ తాను వాళ్ళళొ ఒకడు కాదు. తాను వాళ్ళలో ఒకడైతే, “ఏకమౌదాం” అనేవాడు. ఏకం కండి అనే వాడు కాదు.
  ఎదుటి వారు కష్టాలలో ఉంటే వారి కష్టాల పట్ల సానుభూతి చూపించటంలో తప్పు లేదు. కానీ “వారు పోరాటాలలోకి వెళ్ళాలా వద్దా, జీవితాన్ని ప్రమాదం లో పడేసుకోవాలా వద్దా” అనేవి వారు తీసుకోవలసిన నిర్ణయాలు. వాటి గురించి మార్క్స్ మహాశయుడు నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం. కార్మికులు ప్రాణాలు పోగొట్టుకొవటానికి సిధ్ధం గా లేక పోతే ఏమి చేస్తాం? మనకి “వాళ్ళదేమి జీవితం రా”, అని జాలి కలిగినా, వాళ్ళ జీవితం వాళ్ళకి విలువైనది అవ్వవచ్చు. వాళ్ళ జీవితమ్మీద వాళ్ళకి జాలి లేక పోవచ్చు. ఏ సినిమా నటుడి కొ సాధారణ మధ్య తరగతి జీవిని చూసి, “ఇతనిదీ ఒక జీవితమేనా?”, అని జాలి కలగ వచ్చును. కానీ ఆ సదరు మధ్య తరగతి జీవికి తన మీద తనకి జాలేమీ లేక పోవచ్చును. కాబట్టీ లేని అసంతృప్తిని లేవగొట్టి జనాల బ్రతుకుని నరకం చేయటం ఎందుకు?”

  ఇంక సివరి గా, నేను ఓ రెండు పేద్ద కతలు రాసినానబ్బా…నాకు నువ్వు సదివి నీ మాటేంటొ సెప్తే ఇనాలనుంది. తీరికున్నప్పుడు సదివి సెప్పే…
  లకెలు ఈడ ఉన్నాయి..
  http://wp.me/pGX4s-52
  http://wp.me/pGX4s-7Z
  ఇంక సరే నిద్రొత్తాండాది..ఇంకా బబ్బోవాలి…ఆహ్..


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: