మాథ్యూ ఎఫెక్ట్

For unto everyone that hath shall be given, and he shall have abundance.but from him that hath not shall be taken away even that which he hath.

అది బ్రిటీష్ కొలంబీయాలోని  వాంకూవర్. 2007- మే  నెలలో  ఓ వెచ్చని వసంతపు రోజు.  మెమోరియల్ కప్ హాకీ ఛాపియన్‌షిప్  కోసం , వాంకొవర్ జెయింట్స్‌తో  మెడిసిన్  హ్యాట్  టైగర్స్ తలపడనున్నారు.  ప్రపంచంలోనే  పేరెన్నికగన్న  ’కెనడియన్ హాకీ లీగ్‌’లో,  ఈ   రెండూ చాలా ఉత్తమమైన  జట్లు. ఈ క్రీడాకారులందారు  ఉద్దండ పిండాలు.  పదిహేడు పద్దెనిమిది ఏళ్ళున్న ఈ ఆటగాళ్ళందరూ, పారాడే  వయసు నుంచే  స్కేటింగ్ చేసేవారు.   ’పక్స్  ’ పీకేవారు – ఐస్ మైదానంలో; ముక్కులో   పక్కులు కాదు.

కెనడియన్ నేషనల్ టివీలో ఈ ఆటని ప్రసారం చేశారు. వాంకూవర్ వీధి వీధిలో , ఈ ’మెమోరియల్ కప్’ బ్యానర్లే వేళ్ళాడేశారు. ఎరినా మొత్తం  ఆ రోజు సందర్శకులతో కిక్కిరిసి పోయి ఉంది. ఐస్ మీద ఓ పొడగాటి ఎర్ర తివాచి పరిచారు.  ఆట డిగ్నిటరీస్ అందరినీ అనౌన్సర్ పరిచయం చేస్తున్నాడు. మొదటగా బ్రిటీష్ కొలంబియా ప్రీమియర్ శ్రీ గోర్డన్ క్యాంబెల్ విచ్చేశాడు. అతని వెంటే,  మిన్నంటుతున్న హర్షాతిశయ హాహాకారల మధ్య  లెజండరీ క్రీడాకారుడు  శ్రీ గోర్డీ హావీ  వస్తూంటే,  “లేడీస్ అండ్ జెంటల్‌మెన్” అనౌన్సర్  అరుస్తూ ఆహ్వానించాడు – “మిస్టర్ హాకీ”.

ఆ తర్వాత అరవై నిమిషాలు,  అలుపెరుగని ఆట.రెండు జట్లు విజృంభించి ఆడాయి. రెండో రౌండు ప్రారంభంలో,  మ్యారియో బ్లిజాంక్  కొట్టిన రిబౌండ్‌తో , వాంకోవర్ జెయింట్స్ మొదటి స్కోరు సాధించింది. రెండో రౌండు చివరికొచ్చే సరికి, మెడిసిన్ హ్యాట్స్ ఈ సారి మా వంతు అంటూ  స్కోరు సాధించారు. జట్టు స్కోరింగ్ లీడరు , డారెన్ హెల్మ్ అతి వేగంగా కొట్టిన షాట్‌తో బంతి వాంకోవర్ గోలీ – టైసన్ సెక్స్‌స్మిత్‍ని చెంగున దాటేసింది. మూడో రౌండులో , గెలుపుకు చేరువచేసే  రెండో స్కోర్ సాధించిన వాంకోవర్, అసహనంతో  మెడిసిన్ హ్యాట్స్ తమ గోలీని మార్చేయటంతో, ముచ్చటగా మూడో గోలు కూడా కొట్టేసింది.

ఆట ముగిసిన తరువాత,  గెలిచిన  జట్టు ఆటగాళ్ళు, వాళ్ళ కుటుంబాలు , దేశం నలుమూలల నుండి వచ్చిన విలేకరులూ, అందరూ ఇరుక్కుంటూ లాకర్ రూములో  దూరిపోయారు. గాలిలో సిగార్ పొగ,  చమట కంపు, దానిలో మిళితమైన చాంపైన్ వాసనలతో గది నిండిపోయింది. గోడ మీద వేలాడుతున్న బ్యానర్ పై , ఎవరో చేత్తో రాసిన అక్షరాలు  “కష్టాన్ని కౌగిలించుకో” మంటున్నాయి.  జెయింట్స్ జట్టు కోచ్, గది మధ్యలో నిలబడ్డ  డాన్ హే,  చెమర్చిన కళ్లతో  చెప్పాడు  ” ఈ కుర్రాళను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇక్కడ లాకర్ రూమ్‌‌లో  ఉన్న ఆటగాళ్ళందరిని  ఓ సారి చుట్టూ కలయ చూడండి. మనస్పూర్తిగా  ఆడనివాడు ఒక్కడూ లేడు.” అన్నాడు.

కెనడియన్ హాకీ ఓ మెరిటోక్రసీ.  కెనడియన్ పిల్లకాయలు ,  కిండర్‌గాడెన్ కూడా దాటకుండానే  ఈ ఆట ఆడేస్తుంటారు. అలాంటి కొన్ని వేల మంది ఆటగాళ్ల నుంచి, ప్రతి వయో తరగతికీ,  ఓ లీగ్‌ని ఏర్పాటు చేస్తుంటారు. ప్రతిస్థాయిలోనూ జల్లెడ బట్టేసి, ఏరేసి, తీర్చి దిద్దిన ఆటగాళ్లలోంచి, ఉన్నతమైన ఆటగాళ్ళను పై స్థాయిలోకి చేరుస్తుంటారు.  అలా టీనేజ్ వయసు మధ్యకొచ్చేసరికి, అత్యున్నతమైన  ఆటగాళ్ళని, ’మేజర్ జూనియర్ ఏ’ అనే ఓ అత్యున్నతమైన లీగ్‌లోకి చేరుస్తారు.  అదే పిరమిడ్‌లో  టాప్‌కి చేరుకోవటం.ఒకవేళ మీ ’మేజర్ జూనియర్ ఏ’ జట్టు గానీ , మెమోరియల్ కప్ గెలుచుకునేందుకు ఆడుతోందంటే,  మీరు టాప్ ఆఫ్ ది టాప్ ఆప్ ది పిరమిడ్ అని అర్ధం.

చాలా క్రీడల్లో, ఫ్యూచర్ స్టార్స్‌ని ఇలాగే ఎంపిక చేస్తారు. యూరోప్లోనూ, సౌత్ అమెరికాలోనూ సాకర్‌ ఆట కూడా ఇలాగే  ఉంటుంది. ఒలింపిక్స్‌ కోసం అథ్లెట్లనూ ఇలాగే ఎంపిక చేశ్తారు. నిజం చెప్పాలంటే,  శాస్త్రీయ సంగీతంలో భవిష్యత్తు పండితులనీ, బాలెలో భవిష్యత్తు బ్యాలెరినాలనీ, లేదా మన ఉత్తమ విద్యా విధానం(elite educational system)లో శాస్త్రవేత్తలనీ, మేథావులనీ  ఎంపిక చేసే విధానం దీనికి భిన్నమైనదేమీ కాదు.

“మేజర్ జూనియర్ ” లోకి  ప్రవేశించటం అంటే ఆషామాషీగా  కాదు.  ఏదో ఒకటి చేసేసి మీరు అందులో దూరిపో లేరు. మీ  తల్లిదండ్రులు పేరుప్రతిష్టలు , వారి ఉన్నత వ్యాపార లావాదేవీలు –  ఇలాంటివి ఏమీ చెల్లవు. లేక మీరేదో  కెనడా ఉత్తరాగ్ర కొనభాగ నివాసస్థులై  ఐసులో పుట్టిపెరిగిన  లాభం లేదు.  హాకీలో విజయం కేవలం మీ వ్యక్తిగత  మెరిట్ మీద ఆధారపడి ఉంది.  మీరు సమర్ధులైతే, ఆ విస్తృతనెట్వర్క్‌లోని  హాకీ  స్కౌట్స్ మిమ్మలిని వెతుక్కుంటూ వచ్చి తోడెళ్తారు.  మీ సమర్ధతని పెంచుకునే దిశలో మీరు కృషి  చేయదలిస్తే,  వ్యవస్థ మిమ్మల్ని అందాలాలు ఎక్కిస్తుంది.  ఆటగాడు తన సొంత ప్రదర్శన మీద నిర్ణయించ బడతాడు, మరెవరి పైరవీలూ గానీ , ఏ ఇతర అంశాలుగానీ పనిచేయవు. తన సమర్ధత మీద తప్ప మరే  ఇతర  ఆర్బిట్రరీ ఫ్యాక్ట్ మీద కాదు.

నిజంగా అది నిజమా? నిజం అంతేనా???

Explore posts in the same categories: Uncategorized

ట్యాగులు:

You can comment below, or link to this permanent URL from your own site.

వ్యాఖ్యానించండి