అల్లాని ప్రార్ధిస్తే, హిందువుని కాదా?

“అల్లాని ప్రార్ధిస్తే, హిందువుని కాదా?”.  

చెవిపోగులు, నుదుటిన బొట్టు పెట్టుకున్న ఆ ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు, అసందర్భంగా నే వేసిన ప్రశ్నకి సెకనులో వెయ్యోవంతు కాలం తత్తరపడ్డాడు. నాకు కొంచెం పిచ్చి ఉందేమోనన్న అనుమానం కూడా వచ్చుంటుంది. అతను నా వద్దకు వచ్చింది,సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పివెళ్ళటానికి.

“ఎందుకవ్వరు సార్, హిందువే ఔతారు” అన్నాడు.

సమాధానం నాకు సంతృప్తినిచ్చింది. పర్వాలేదు, ఈ దేశంలో ఇంకా దేవుడిని దేవుడిగానూ, రాజకీయాన్ని రాజకీయంగానూ చూసే వాళ్ళున్నట్టున్నారు.

“ఏం లేదూ, ఈ పిచ్చి ప్రజలు పవర్ పాలిటిక్స్‌లో ఎందుకు కాలిపోతున్నారో తెలీక నాకు పిచ్చెక్కి పోతోంది. బహుశా, వాళ్ళకు తెలుసేమో – వాళ్ళు చేస్తున్నది రాజకీయం అనీ, ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అని. నీ సమాధానం నచ్చింది, All the best. Wish you happy Sankranthi ” అని చెప్పి పంపించాను. అలా, మీకూ విషయం తెలిసే ఉంటే, టైమ్ వేస్టు చేసుకోకండి. తెలిసినా, నా పిచ్చి చదవాలనుకుంటే, రండి. రాసేది నలుగురు చదవాలనే కదండి.

ఈ దేశంలో ఉన్న భిన్నత్వంగాక, కొన్ని కొత్త వర్గాలు / గ్రూపులు –  ఏ పేరున పిలవాలో తెలీదుగానీ – కొత్త గుంపులు తయారయినాయి. స్వాతంత్రసమరంలోనూ, జాతీయవాదంలోనూ, కమ్మునిస్టుల్లోనూ,  ’సెక్యులరిస్టులు’  పుట్టారు. వ్యతిరేకంగా ’మతతత్త్వవాదులు’ పుట్టారు. కానీ తర్వాత “సూడో సెక్యులరిస్టులు” పుట్టారట. ఇప్పుడు “’యాంటీ’ సూడోసెక్యులరిస్టు”లూ పుట్టారుట! ’యాంటీ’-సూడో సెక్యులరిస్టులకి, నిజమైన సెక్యులరిస్టులతో సమస్య లేదుట. కేవలం “సూడో సెక్యులరిస్టు”లతో సమస్యట. మరి ఈ సూడో సెక్యులరిస్టులు ఎవరో ఇంకా నాకు అంతుబట్టులేదు. ఎక్కువగా అర్ధమైందైతే ఇది:
సెక్యులరిజం పేరిట ముస్లింలకు, మైనారిటిలకీ దొబ్బపెట్టి, హిందువులని మాత్రం సెక్యులరిస్టులగా ఉండమని, హిందువుల నోళ్ళల్లో మట్టిగొట్టేవారుట.

బావుందయ్యా. అంటే, హిందువులకు “సొంత” మైనదేదో, దక్కవలసినదేదో మొత్తానికి వాళ్ళనుంచి తీసేసి, ఇతరులకిస్తున్నారు. కాబట్టి హిందువులు నష్టపోతున్నారు. అంతే కదా. అయితే, నువ్వు హిందువులు తరుఫున మాట్టాడుతున్నావు గాబట్టి, నిన్ను “హిందుత్వవాది” అననా? అంటే, కాదు పొమ్మంటాడు. ’ఠాట్. నేను యాంటీ-సూడో సెక్యులరిస్టు’ అంటాడు!

సరే – ప్రశ్నకొద్దాం. నేను అల్లాని ప్రార్ధిస్తే, హిందువుని కాదా?

దేవుడు ఒక్కడే. ఇద్దరు దేవుళ్ళుంటే, వాళ్ళూ కొట్టుకు ఛస్తారు మనలాగానే! 🙂  దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఇది సరియైన పద్ధతి కాదుగానీ, దేవుడు/పరమాత్మ/ఆత్మొక్కటే నన్నప్పుడు, అది ఒక్కటే అని భావం. దాన్ని అల్లా అని పిలిచినా, హనుమాన్ అని పిలిచినా, షిర్డి సాయిబాబా అని పిలిచినా, జీసస్ క్రైస్ట్ అన్నా, మేరీ మాతా అన్నా, దుర్గా మాతా అన్నా, పోలేరమ్మా అన్నా, బతకమ్మా అన్నా – అన్నీ ఒక్కటే! కాబట్టి, నేను అల్లాని ప్రార్ధించినా, హిందువునే!

కానీ అల్లాని మనం దేవుడిగా ఎందుకు కొలవలేకపోతున్నాం? జస్ట్, అలవాటు లేకంతే! ఒట్టి రాముడినో, కృష్ణుడినో దేవుడిగా భావించటం వల్ల, మనం హిందువులం అవ్వటం లేదు. దేవుడిని నమ్మటం వల్ల, ప్రార్ధించటం వల్ల కూడా మనం హిందువులమవ్వటం లేదు. హిందువుల్లో నాస్తికులు కూడా ఉంటారు. పుట్టకతో ఒకడు హిందువు; అంటే, వాడు ఎక్కడైనా, ఏ దేశంలో ఐనా, ఏ మతంలో ఐనా, ఏ భాషలోనైనా, ఏ సంస్కృతిలో నైనా పుట్టచ్చు.

సనాతనధర్మం అనుకునేదేదో,  ఈ భారత దేశంలో పుట్టిన వాడి సొంత ఆస్థి కాదు.  ఎక్కడ ఎప్పుడు పుట్టినవాడైనా, తెలుసుకోగలడు. ఆచరించగలడు. ఆచరింపచేయనూ గలడు. ఒక్కొక్కరి ఆచరణ, ఒక్కొక్కరి మతం. ప్రపంచంలో ఏ మతాన్ని చూసినా, అది ఒక way of లైఫే! హిందూ మతం అసలు మతమే కాదు అని వాదించటం కూడా, మత తత్త్వానికి చాలా దగ్గరగా ఉన్నట్టు.

ఐతే, భారత దేశంలో ఉన్న శివ,రామ,కృష్ట, హనుమాన్, అమ్మవారు, సాయిబాబా, బాలాజీ టైపు- హిందువులకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇలా అందరి దేవుళ్లని ’దేవుడి’గానే భావించగలగటం మన ’సెక్యులరిజం’ కదా! అని. ఓ విధంగా అలాగని పిస్తుంది కానీ, అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే, దేవుడు లేడన్నవాడు కూడా హిందువే! కాక, ’సెక్యులరిజం’ అన్న ఐడియా  రాజకీయాలకి సంబంధించింది. దేవుడిని ప్రార్ధించుకోవడానికి సంబంధించి,  ’పరమత సహనం’ అన్న మాట కూడా చాలా తప్పుడు మాట.

దశావతారం సినిమాలో కమల్‌హాసన్ చెప్పినట్టు, ఈ ’పరమతాలు’ దేశంలో రాక మునుపు కూడా, శైవ వైష్టవాలు కొట్టుకు చచ్చేవి. కాకపోతే,

అల్లాశ్చహృదయం విష్ణుః విష్ణోశ్చహృదయం శివః.
యధా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయ అల్లా:
యధాంతరం న పశ్యామి తధామే స్వస్తి రాయుషీ

అని సంస్కృతంలో శ్లోకం దొరకక, మనకి అల్లాని ప్రార్ధించే అలవాటు రాలేదనుకుంటాను. ఎలా దొరికితే అలా, కాస్త క్రీస్తుపురాణం,అల్లాపురాణం లాంటివి చదువుకోవటం వల్ల కూడానూ,పరమ భాగవతోత్తముల గతిని పొందగలం.

రామమందిర సమస్యకి ఇది మీ పరిష్కారమా? అక్కడ అల్లాని ప్రార్దిద్దామా? అంటే – నేను చెప్పలేను. అది దైవానికీ, ప్రార్ధనకీ సంబంధించిన విషయం కాదు. కొంతకాలం అక్కడ రెండు ప్రార్ధనలూ జరిగాయి కూడా. ఒక దేవాలయంలో, మరో దేవుడి/దేవత విగ్రహం ఉండటం హిందువుల  వైపునించీ, తప్పు కాదు. ముస్లింలు దాన్ని మస్జీద్‌గా భావించనక్కరా లేదు. కానీ ఈ సమస్య రాజుకుంది తతత్త్వవాదం వల్ల. ’మతతత్త్వవాదం-సెక్యులరిజం’ అనేవి దేవుడిని లక్ష్యంగా పెట్టుకొని తయారు చెయ్యలేదు. రాజ్యాధికార లక్ష్యంతో తయారు చేశారు.  ఈ వివాదం ఓ రాజకీయ సమస్య.  ఉళ్ళో జనాలవల్ల కూడా ఈ వివాదం రావచ్చు. అప్పుడు,రాజకీయంలో సైతం సామరస్య పరిష్కారాలుంటాయి. ఐతే, ఇక్కడి రాజకీయల లక్ష్యమే వివాదాన్ని నిలిపి ఉంచటం గాబట్టి,  సెక్యులరిస్టులైనా, అటు-ఇటు సంబంధించిన మతతత్త్వవాదులైనా దీన్నించి లాభపడాలనే చూస్తారుగా. కానీ, ఎప్పటికైనా, ఎవ్వరికైనా, ఈ సమస్యని ఏదో విధంగా ’మేం గెలిచాం అంటే మేం గెలిచాం’ అని చెప్పుకుంటూ వదిలించుకోవాలి.  ఇంకో పాత ఐడియా ఉంది. ఇద్దరికీ ఉమ్మడిగా కలిపి ఓ బూచిని సృష్టించడం. అది కూడా అంత వీజీ ఏం గాదు. కాక, ప్రస్తుత రాజకీయ- ఆర్ధిక శక్తులు నెక్సస్ ఎలా ఉందంటే,  అలాంటి కామన్ బూచి అవసరం ఇంకా కలగట్లేదనిపుస్తుంది.

ఐతే, “అల్లాని ప్రార్ధించినా నేను హిందువునే” నన్న విషయం అవగతమైతే, రాజకీయాన్ని రాజకీయంగానే అర్ధం చేసుకుంటాం.”మేము ఆధిపత్యం నిలబెట్టుకోవటం కోసం ఈ వాదాన్ని అవలంబిస్తున్నాం” అని చెబితే నాకు ఏ గొడవా లేదు. ఈ ఆధిపత్య పోరాటంలో నేను ఏమీ మాట్టాడక్కరలేదు. అధికారం కంటే, దేవుడే నాకు దగ్గరగా ఉండటం వల్ల,  దేవుడిని పావుగా చేసుకున్న రాజకీయంలో నలిగే దేవుని భక్తులకి మాత్రం, ఈ విషయం చెప్పాలని నాకు అనిపించి చెప్పాను.

రాజకీయాలకతీతంగా, మతాలకతీతంగా , దేవుడనేవాడు భక్తుడిని కాపాడతాడు – వాడు ముస్లిం ఐనా, హిందువైనా, క్రిస్టియనైనా. దేవుడు ఒక్కడే. సంస్కృతాన్నే మర్చిపోయినా, అసలు రాముడు, కృష్ణుడు మొదలైన సమస్త సోకాళ్డ్ హిందూ దేవుళ్లందరిని ఈ క్షణం మర్చిపోయి, అల్లానే దేవుడని ప్రార్ధించినా – సనాతన ధర్మం ఏమీ అంతరించిపోదు. ఎక్కడ నుంచైనా, మానవుడి నుండి మళ్ళీ అది వినిపిస్తుంది. కనిపిస్తుంది. పిలుపిస్తుంది.నడిపిస్తుంది.

మరి హిందువులుగా ఈ భయం దేని గురించి? నిర్ద్వంద్వంగా, ఇది అధికారం గురించి. సామాజిక ఆధిపత్యత గురించి. ఈ విధంగా చూసినప్పుడు, ఈ ’యాంటీ’ సూడో సెక్యులరిస్టు అన్నవాడు – మతతత్త్వవాదే కానీ, మత తత్త్వంలోనీ కొన్ని గుణాలను వదిలించుకో జూస్తున్నవాడు.

అంచేత, పుట్టుకతో హిందువులైతే, రామాయణంతో  ఆగిపోవద్దు. పూజలో అల్లాని ప్రార్ధించటం కూడా అలవర్చుకుందాం.

నిజానికి అలా అన్నిటిని అసిమిలేట్ చేసుకోపోగల శక్తే, ఈ దేశంలో హిందువులకి సామాజిక ఆధిపత్యాన్ని కట్టబెట్టిందేమో? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ మత, దేశ, భాష, తెగ, రంగు మొ|| వాళ్ళలో ఉన్న సిసలైన హిందువులే ( వారిని ఆయా దేశాల్లో హిందువులు అనక పోవచ్చు)  ఈ అసిమిలేటివ్ కల్చర్‌ని ప్రోత్సాహిస్తూ, పెంపొదించుతూ వచ్చేరేమో?

భిన్నత్వాన్ని కాపాడగల,  అసిమిలేటివ్ క్వాలిటీయే  మానవులందరిలోనూ ఉన్న ఓ లక్షణమేనేమో?

ప్రకటనలు
Explore posts in the same categories: Uncategorized

8 వ్యాఖ్యలు పై “అల్లాని ప్రార్ధిస్తే, హిందువుని కాదా?”

 1. akasaramanna Says:

  అవును, మీరు హిందువు కానట్లే. దీన్నే మరోలా ఆలోచించండి, రామున్ని కొలిస్తే, నేను ముస్లిమును కానా అని. కాదనే చెబుతారు. కావాలంటే అడిగి చూడండి.


 2. దేవుడు నిజంగా ఉంటే ఓసారి కనిపించి తాను మతాలకి అతీతుడిని అని చెప్పాలి.

 3. Mohd Javed Says:

  “అవును, మీరు హిందువు కానట్లే. దీన్నే మరోలా ఆలోచించండి, రామున్ని కొలిస్తే, నేను ముస్లిమును కానా అని. కాదనే చెబుతారు. కావాలంటే అడిగి చూడండి”

  ఎందుకంటె, ముస్లిం కాన్సెప్ట్ లొ ఒకే ఒక్క దెవుడు. దెవుడిని కొలిస్తే, నేను ముస్లిమును కానా అంటె, ఎస్, ముస్లిమే.

 4. cheekati Says:

  Excellent analysis brother.. Keep it up..

  God might be laughing at those, who claims ‘his religion is great’.

  Thanks

 5. Anon Says:

  ఓ పరిద్ధాత్ముడైన ఏసుప్రభువా! నన్ను పాపములనుంచి రక్షించు అని ప్రార్థించే వాడు ముస్లిం కాడా? జిహాదు చేయాలనే వాడు క్రైస్తవుడా? నమాజు చేసే వాడు యూదుడు కాడా? ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.
  ఒక మతాన్ని అవలబించేవారు, ఆమత నియమాల్ని తు.చ.తప్పకుండా ఆచరించలేకపోయినా, ఆ మతవిశ్వాసాలపై కొద్దిగా విశ్వాసం కలిగి వుంటారు. మీరు చెప్పింది రాజకీయం. అల్లా పూజ, జీసస్ అష్టోత్తరి చేసే వాడు ఎవరినో ఇంప్రెస్ చేయాలనే వెస్టెడ్ ఇంటరెస్ట్ తోనే చేస్తారు. ఎవరికి వారు తమ తమ మతవిశ్వాసాలకు ఆచరించటం తో పాటు, ఇంకొకడి మతంపై బురద చల్లకుంటే చాలు. ఇలాంటి సంకర మతరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అందరూ ఒకరే ఐనపుడు, హిందూ పేర్లనే వాడుకోవచ్చు కదా, అల్లా అనే ఎందుకు అనాలి?

 6. sri Says:

  రే రాజ్ గారు,
  నేను మీ బ్లాగు చాలా రోజులనుంచి చదువుతున్నా మీ వివరాలు ఎమి తెలియవు.
  మీ అసలు పేరేమిటి? ఎక్కడ ఉంటారు? ఎమి చదివారు? మీరు ప్రొఫెషనల్ రచయితా? సుమారు ఎంత వయసు మీకు ఉండవచ్చు. ఇటువంటు వివరాలు మీరు తెలియ జేస్తే బాగుంట్టుంది. మీ వివరాలు తెలియటం వలన మీ బ్లాగు చదివిన వారు వ్యాఖ్యానించేటప్పుడు చాలా ఉపయొగం ఉంట్టుంది.సీరియస్ విషయాలు రాసె మీరు మారు పెరు తో బ్లాగు రాయటాం ఎందుకు?

 7. B.R.R Says:

  చాలా బాగుంది , కానీ ,ఎక్కువగా వ్రాసి, విపులంగా చర్చిస్తే ఇంకా చాలాబాగుంటుంది


స్పందించండి

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: