నేను రాముడిని! ఔనండీ!
ఏ!?
’నేను హోమో సెక్సుయల్’
’నేను లెస్బియన్’
’వివాహేతర సంబంధం పెట్టుకోవటం నా వ్యక్తిత్వానికి అవసరం’
ఈ రకంగా ’ఎసెర్షన్’ చేసుకుంటున్న రోజులండీ ఇవీ! మరీ నేను ఎసర్టివ్‍గా ఎందుకుండ కూడదు!! అసలే నేను పుట్టుకలతో ఎసెర్టివ్ క్యారెక్టర్ని!
ఔనండీ! నేను పుటకలతో రాముడిని. నేను భార్యతో మాత్రమే సంగమిస్తాను. ఎందరు శూర్పణఖలు కొంగులు జార్చినా, మాటలతో రెచ్చగొట్టినా, నేనింతే!!
చిన్నతనంలో “రాముడు మంచి బాలుడి టైపు కదా! నీకెందుకూ!” అనెవరన్నా అంటే, చిరాకు దొబ్బేది. దానికి వ్యతిరేకంగా నేను అవలంబించిన నా ప్రతిక్రియ – నా తీవ్ర సెక్సు కోరికల గురించి “మాట్లాడటం”. దాని వల్ల చుట్టూ ఉన్నవాళ్లు కొందరు ఆనందించే వాళ్ళు, కొందరు “బాబోయ్ వీడితో పెట్టుకోవద్దు!” అనుకునే వాళ్ళు, “మరి కొందరు అందుకే వీడికెప్పటికీ అమ్మాయిలు పడరు” అనుకునేవారు. వాళ్లకేం తెలుసు? మనం అవతలి అమ్మాయిని బోర్డరులో వదిలేసేవాళ్ళమని!! ( ఇది ఎంత వేస్టు ప్రతిక్రియో, ఈ ప్రతిక్రియ సోషల్ కండిషనింగ్‌లో ఏర్పడిందన్న విషయం, కొంచెం వయస్సు వచ్చే వరకూ తెలీలేదు.)
మొన్నీ మధ్య డిస్కవరీలో ఏదో ప్రోగ్రాం చూశాను. అందులో ఓ నేలబారు జంతువు కూడా ఇంతే! తన మేట్‌ను వెతుక్కొని, దొరికిన తర్వాత జీవితకాలం అదే మేట్‌తో ఉంటుంది. ఆ రెండు, పక్క పక్కనే నడుచు కుంటూ, న్యూజిలాండు అడువులంతా తిరుగుతాయి. అనువైన స్థలాల్లో కొన్నేళ్ళకోసారి పునరుత్పత్తి చేస్తాయి. మళ్ళీ యాత్ర కొనసాగిస్తాయి. వింతగా ఉందా!! మీకు ఉందేమో! నాకు ఉండదు. ఎందుకంటే, ఇలాంటి నిర్మాణంలోనే రాముడు, నాలాంటి వాళ్ళు పుట్టారు. అందుకే, ఇది సహజమే అని రాముడికీ, నాకూ తెలుసు. I am what I am! rt!
ఈ పెద్దలు నేర్పిన రామాయణ విలువల వల్ల, నేను రాముడినయ్యానా అనుకుంటూ, చాలానే ప్రశ్నించుకున్నాను. తర్కించుకున్నాను. చివరికి తెలిసిందేమిటంటే, నేను రాముడినే! అని. అంటే, విలువలన్నీ అతి వేగంగా మారిపోయి, ’అర్జెంటుగా అరడజనుతో సంబంధాలు’ పెట్టుకుంటేగానీ బతకటం కుదరదనే రోజులొచ్చేస్తే, నేను ఆ సమాజంలో బతకలేను. అప్పుడు నేను బతకడం కోసం, చాలా కష్టపడతాను. ఎంతో మానసిక వేదననీ అనుభవిస్తాను.
అలాగే, స్త్రీలలో నిఝంగా సీతలూ ఉంటారు!
నా ఉద్దేశ్యం, ఒకానొక కాలంలో, ఎవల్యూషన్లో ఎప్పుడో, నా లాంటి రాముళ్ళూ, సీతలూ మెజారిటీగా పుట్టారు. దానికీ కొన్ని ఎవల్యూషనరీ, యాంత్రపోలాజికల్ రీజన్సు ఉండే ఉంటాయి. బహుశా అలా పుట్టడం వల్లే, రామాయణంలో రాముడు “హీరో” అయ్యాడు. మిగిలిన రాముళ్ళు, సీతలూ, తమ తమ ఆధిపత్యం కోసం, ’ఇవే’ విలువలన్నారు. అదే ఫ్యాషనైపోయి, అదే సంస్కృతైపోయి…………………..అలా అలా ఇక్కడొకొచ్చి చేరాం. కానీ, మా జాతి ఇంకా ఉంది.కాస్త కష్టకాలంగా ఉంది అంతే!
అలా అని మేము ఐశ్వర్యరాయ్‌ని ’అలా’ చూడమా? అనే అనుమానమే వద్దు. పాత సినిమాల్లో చంద్రకళల నుంచి, నేటి..ఎవరదీ?…”తెల్లారి పోనీకు..ఈ రేయిని” దాకా, లేదూ కాజల్ దాకా అందరిని ’అలా’ గే చూస్తాం. దీనికి కుతర్కవాదులు జోడించిన వాదం ఏంటంటే, ఇది మానసిక వ్యభిచారం ట!!! సిగ్గులేక పోతే సరి!
ఇప్పుడూ….ఆ ఎగిరే పక్షులు చూడు, ఈ సెలెయేటి గలగలలు వినూ, ఆ చందమామను చూడు….ఆ గువ్వాగోరింకలు చూడు…..అంటున్నప్పుడు, అది “యానిమల్ ఫిటిష్” కాదురా అబ్బీ! ఊరికే, అదో మూడ్ క్రియేషన్ అన్నమాట! వనవాసంలో రాముడు, సీతా కూడా ఇలాంటి ఇచ్చిక పుచ్చికలాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో డిటిహెచ్ లేదు కదా, అందుకని వాల్మీకి అప్పటి రొమాంటిక్ సీన్లే రాసేవాడన్నమాట!! మేమేమో ఇప్పుడు టివీల్లోనూ, సినిమాల్లోనూ ఎక్కువగా చూస్తాం. ఎప్పుడన్నా చుట్టు ఉన్న జనాల్లోనూ చూస్తాం. అర్ధమైందా!?
అందుకని, ఎదురుకుండా ఏదన్నా అందం కనిపిస్తే, కళ్ళతో ’జుర్రేసినా’ అది వ్యభిచారం కాదు. మరో స్థాయిలో అసలు వ్యభిచారమూ తప్పు గాదు. ఎటొచ్చీ విషయం ఏంటంటే, నేను మాత్రం భార్యతోనే రమిస్తాను. నేనింతే!!!!
నేనిది ముఖ్యంగా ఎందుకు రాశానో తెలుసా! ఒకవేళ మీరూ రాముడో, సీతో అయ్యి, “ఇదేంటీ మనం ఈ లోకంలో చెడబుట్టాం” అని ఫీలవుతున్నారేమో అని!!! హోమోసెక్సుయాలిటీ, లెస్బియనిజం, వివాహేతర సంబంధాలు ఎంత సహజమో, ఎలా అవి కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొందరి కొందరి మనుష్యలకి అలా జరిగిపోతుంటాయో, మనకి అలాంటివి ఎప్పటికీ జరగక పోవటము అంతే సహజమూ! దాని గురించి మీరు భయాందోళనలు చెందకండీ అని!!
ఆ న్యూజిలాండులోని జంతువు పేరు ఎవరికన్నా తెలిస్తే మాత్రం చెప్పండే! ఆ పేరుతో నేను ఓ సంఘం స్థాపిస్తాను! మనలాంటి వాళ్ళ కోసం!

ఇటీవలి అభిప్రాయములు